Corona Virus: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 16 లక్షలకు పైగా కేసులు!

Over 16 lakh corona cases recorded worldwide yester day
  • నిన్న 7,317 మరణాల నమోదు
  • కరోనా దెబ్బకు అమెరికా, యూకే ఉక్కిరిబిక్కిరి
  • పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్న కేసులు, మరణాలు
  • అమెరికాలో నూతన సంవత్సర వేడుకల రద్దు
  • బ్రిటన్‌లో నిన్న 1.83 లక్షల కేసులు
అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పటికే వున్న కరోనా వేరియంట్లకు సరికొత్త ఒమిక్రాన్ వేరియంట్ తోడు కావడంతో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 16.04 లక్షల కేసులు వెలుగుచూశాయి. అలాగే, 7,317 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 4 లక్షలు, మరణాలు 800 పెరగడం గమనార్హం.

అమెరికాలో అయితే, 4.65 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తక్కువ కావడం ఊరట కలిగించే అంశం. అలాగే 1,777 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలు సహా కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశారు. ఫ్రాన్స్‌లో 2.08 లక్షల కేసులు వెలుగు చూడగా, 108 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో బుధవారం 41,816 కేసులు నమోదు కాగా, నిన్న వాటికి మరో వెయ్యి తోడయ్యాయి.

రష్యాలోను మరణాలు భారీగానే సంభవిస్తున్నాయి. అక్కడ నిన్న 932 మరణాలు నమోదయ్యాయి. పోలండ్‌లో కరోనా కేసులు తక్కువగా వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ నిన్న 794 మంది మరణించారు. ఆ దేశంలో 15 వేల లోపు కేసులు రికార్డవుతున్నాయి. ఇక, యూకే అయితే ఒమిక్రాన్ దెబ్బకు విలవిల్లాడుతోంది. బ్రిటన్‌లో నిన్న 1.83 లక్షల కేసులు బయటపడ్డాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇవి 32 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
Corona Virus
USA
UK
Russia
Omicron

More Telugu News