Ram Gopal Varma: వాళ్లు రాక్షసుల్లా ఎలా మారారో తెలుసుకోకుండా కాల్చి చంపేస్తారా?: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Sensational Comments On Rape Incidents
  • అలాంటప్పుడు అది పోలీస్ స్టేట్ అయిపోదా?
  • ‘ఆశ’ సినిమా ఒక అమ్మాయి ఘటనే ఆధారంగా తీసింది కాదు
  • దేశంలో జరిగిన ఎన్నో ఘటనల ఆధారంగా తీశాం
  • ఎన్నో చట్టాలొచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు
  • ఘటనకు ముందు నిందితులంతా మామూలు మనుషులే
‘దిశ’ ఘటన, ఆ తర్వాత జరిగిన ఘటనల ఆధారంగా కల్పిత కథతో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో వస్తున్న సినిమా ‘ఆశ: ఎన్ కౌంటర్’. సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా, అనురాగ్ కంచర్ల నిర్మించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అసలు ఈ సినిమా దిశ గురించి కానేకాదంటూ చెప్పుకొచ్చారు. దేశంలో జరిగిన అఘాయిత్యాలన్నింటి కలబోత అని తెలిపారు.


‘‘ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం కావొచ్చు.. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన కావొచ్చు. దేశంలో ఎప్పుడూ ప్రతి చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఆ ఘటనలన్నింటినీ సినిమాలో చూపించాం. ప్రత్యేకంగా ఓ అమ్మాయి మీద జరిగిన ఘటనే కాదు’’ అని ఆర్జీవీ చెప్పారు. అన్ని ఘటనల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంటుందని, ఒంటరిగా అమ్మాయి కనిపించగానే గ్యాంగ్ లు ప్లాన్ చేసి అత్యాచారాలకు పాల్పడుతుంటాయని అన్నారు.

ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి అత్యాచారాలు దేశమంతటా జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, ఘటనకు ముందు వరకు నిందితులంతా అందరిలాగే మామూలు మనుషులని, ఎలాంటి నేర చరిత కూడా ఉండదని అన్నారు. కానీ, ఘటన జరిగిన రోజు మాత్రం నిమిషాల్లో వాళ్లంతా రాక్షసుల్లాగా మారిపోతున్నారన్నారు. వాళ్లకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అప్పటిదాకా మంచిగున్న వారు రాక్షసుల్లా ఎలా మారారు? అనేది తెలుసుకోకుండా.. వారిని కాల్చి చంపేస్తే అది పోలీస్ స్టేట్ అయిపోదా? అని ఆర్జీవీ ప్రశ్నించారు.

ఈ కథ గురించి చాలా మంది పోలీసులతో మాట్లాడానని, వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాకే సినిమా తీశామని చెప్పారు. ఆనంద్ చంద్ర మంచి ప్రతిభ ఉన్న దర్శకుడని, అందుకే ఆ సినిమా బాధ్యతను అతడికి అప్పగించానని చెప్పుకొచ్చారు.

సినిమా కథకంటూ పరిధులు పెట్టుకున్నాక ఆ పరిధి దాటి ఏ డైరెక్టర్ వెళ్లలేడని, అలాంటప్పుడు ఆ కథను తాను తీసినా, వేరే డైరెక్టర్ తీసినా పెద్దగా మార్పేమీ ఉండదని తెలిపారు. సినిమాలో రేప్ ఎపిసోడ్ 45 నిమిషాలు ఉంటుందని, ఆ తర్వాత ఆమెను చంపి, శవాన్ని మాయం చేయడం, నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వంటి సన్నివేశాలుంటాయని చెప్పారు.
Ram Gopal Varma
Aasha
Rape
Crime News
Tollywood

More Telugu News