Somu Veerraju: బీజేపీకి అధికారం ఇవ్వండి.. నాణ్యతతో కూడిన క్వార్టర్ లిక్కర్ రూ.50కే ఇస్తాం: సోము వీర్రాజు

Andhra Pradesh BJP president Somu Veerraju promises to give liquor at Rs 50
  • నాసిరకం లిక్కర్ అధిక ధరలకు విక్రయం
  • ఏపీలో కోటి మందికి మద్యం అలవాటు
  • వారంతా 2024లో బీజేపీకి ఓటు వేయాలి
  • అప్పుడు తక్కువ రేట్లకే విక్రయిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద ఆఫర్ ఇచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క క్వార్టర్ లిక్కర్ ధర రూ.200గా ఉంది. తెలంగాణలో ఇది ఇంచుమించు రూ.100గా ఉంది. లిక్కర్ కు సంబంధించి సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం లిక్కర్ ను అధిక ధరలపై ప్రజలకు విక్రయిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని నాసిరకం బ్రాండ్లనూ అధిక ధరలకే విక్రయిస్తున్నట్టు చెప్పారు. అందరికీ తెలిసిన ప్రముఖ బ్రాండ్లు మాత్రం లభించవన్నారు.

‘‘రాష్ట్రంలో మద్యం తీసుకునే ప్రతి వ్యక్తి లిక్కర్ కోసం ఒక నెలలో రూ.12,000 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికే ఏదో ఒక పథకం రూపంలో ఇస్తోంది. రాష్ట్రంలో కోటి మంది మద్యపానం సేవిస్తున్నారు. ఆ కోటి మంది 2024లో బీజేపీకి ఓటు వేయాలి. అప్పుడు ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే మొదట్లో ఇస్తాం. ఆదాయం మెరుగుపడిన తర్వాత రూ.50కే విక్రయిస్తాం’’ అని సోము వీర్రాజు ప్రకటించారు.

అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో లిక్కర్ ఫ్యాక్టరీలను నడుపుతూ.. ప్రభుత్వానికి నాసిరకం లిక్కర్ ను సరఫరా చేస్తున్నట్టు వీర్రాజు ఆరోపించారు.
Somu Veerraju
offer
liquor
less price
Andhra Pradesh
bjp
vote

More Telugu News