Tirumala: 10 రోజుల పాటు తెరుచుకోనున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలు!

Tirumala Vaikunta Dwaram to be opened for 10 days from Jan 13
  • జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం
  • తిరుపతి ప్రజలకు ప్రతి రోజు 5 వేల ఆఫ్ లైన్ టికెట్లు
  • ఏకాదశినాడు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథోత్సవ సేవ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోబోతున్నాయి. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.
 
ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అయితే ఎక్కువ మంది ఈ ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వీలుగా వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
 
ఇదే సమయంలో తిరుపతి వాసులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 12 నుంచి 21 వరకు రోజుకు 5 వేల ఆఫ్ లైన్ టికెట్లను తిరుపతివాసులకు కేటాయించామని తెలిపింది. 10 రోజులకు గాను మొత్తం 50 వేల సర్వదర్శనం టోకెన్లను తిరుపతి ప్రజలకు జారీ చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

ఇక, జనవరి 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం వరకు తిరుమలలో గదులను కేటాయించబోమని తెలిపారు. వైకుంఠ ఏకాదశినాడు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథోత్సవ సేవను నిర్వహిస్తామని, ద్వాదశినాడు ఉదయం 5 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు.
Tirumala
Vaikunta Dwara Darshanam
10 Days
TTD

More Telugu News