Payyavula Keshav: బీజేపీ అంటే.. భారతీయ జగన్ పార్టీ: పయ్యావుల కేశవ్

BJP means Bharatiya Jagan Party says Payyavual Keshav
  • హిందుత్వ అంశాలపై కూడా రాష్ట్ర బీజేపీ నోరు మెదపడం లేదు
  • ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు
  • అమిత్ షా చెపితేగానీ అమరావతి రైతుల వద్దకు వెళ్లలేదు

రాష్ట్ర బీజేపీ నేతలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలను కొనసాగిస్తున్నా రాష్ట్ర బీజేపీ నేతలు నోరెత్తకుండా మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. బీజేపీ అజెండా అయిన హిందుత్వ అంశాలపై కూడా నోరు మెదపడం లేదని అన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించిన కేశవ్... కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి చెపితేనే వీళ్లలో చలనం వచ్చిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని బీజేపీ ప్రజల కోసం కాకుండా వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేసే రకంగా తయారయిందని కేశవ్ మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జగన్ పార్టీ అనేలా తయారయిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ నెట్ వర్క్ లో రాష్ట్ర బీజేపీ పని చేస్తోందని అన్నారు. బీజేపీ నిర్వహించేది ప్రజాగ్రహసభ కాదని, దాన్ని జగన్ అనుగ్రహ సభ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ అరాచకాలపై పోరాడాలని హితవు పలికారు. ఏపీలో పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేసే పరిస్థితి నెలకొందని అన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసినా రాష్ట్ర బీజేపీ స్పందించలేదని కేశవ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నా దాని గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. జగన్ ఆర్థిక అరాచకాలపై మౌనంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News