Ram Raj Cotton: ‘రామ్‌రాజ్ కాటన్’ ఆఫర్లంటూ ప్రచారం.. కొట్టిపడేసిన సంస్థ

  • క్రిస్మస్, నూతన సంవత్సర ఆఫర్ కింద రూ. 20 వేల బహుమతి అంటూ వార్తలు
  • వాట్సాప్‌లో షేర్ అవుతున్న లింకులు
  • తమకు సంబంధం లేదన్న రామ్‌రాజ్ కాటన్
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Ram Raj Cotton dismiss over fake offers

తాము ఆఫర్లు ఇస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని రామ్‌రాజ్ కాటన్ స్పష్టం చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా రూ. 20 వేల బహుమతి ఇస్తున్నట్టు ఆ సంస్థ పేరుతో వాట్సాప్‌ గ్రూపుల్లో గత కొన్ని రోజులుగా లింకులు షేర్ అవుతున్నాయి. దీంతో స్పందించిన ఆ సంస్థ ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, షేర్ అవుతున్న ఆ లింకులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పింది.

తమ సంస్థ పేరును చెడగొట్టే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ పని చేస్తున్నట్టు ఆరోపించింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని పేర్కొన్న రామ్‌రాజ్ కాటన్.. ఆ లింకుల్ని షేర్ చేయవద్దని కోరింది. సంస్థ పేరును చెడగొట్టే దురుద్దేశపూరితంగా ఇలాంటి పనులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు, వినియోగదారుల మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు హ్యాకర్లే ఇలాంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన రామ్‌రాజ్ కాటన్.. అలాంటి లింకులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

More Telugu News