India: భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో వేలాదిమంది పాకిస్థానీలు

  • డిసెంబరు 14 నాటికి 10,635 దరఖాస్తులు
  • దరఖాస్తు చేసుకున్న వారిలో 7,306 మంది పాకిస్థానీయులు
  • గత నాలుగేళ్లలో 3,117 మంది పాక్, బంగ్లాదేశ్ మైనారిటీలకు పౌరసత్వం
thousands of Pakistanis apply for indian citizenship

భారతదేశ పౌరసత్వం కోసం వేలాదిమంది పాకిస్థానీలు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు సభ్యుడు అబ్దుల్ వాహబ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. పౌరసత్వం కోసం ఈ ఏడాది డిసెంబరు 14 నాటికి 10,635 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, వాటిలో 7,306 మంది పాకిస్థానీయులే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, వీటిలో 70 శాతం వరకు దరఖాస్తులు పెండింగులో ఉన్నట్టు చెప్పారు. గత నాలుగేళ్లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన 3,117 మంది మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి 1152, శ్రీలంక, అమెరికా నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, ఇతర ప్రాంతాల నుంచి 428 మంది దరఖాస్తు చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. చైనా నుంచి కూడా పౌరసత్వాన్ని కోరుతూ పది మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.

ఎంపీ కె. కేశవరావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత నాలుగేళ్లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవుల నుంచి 8,244 దరఖాస్తులు అందాయని, వాటిలో 3,117 మందికి పౌరసత్వం ఇచ్చినట్టు వివరించారు. అలాగే, గత ఐదేళ్లలో 6 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం ఇటీవల వెల్లడించింది.

More Telugu News