Somesh Kumar: తెలంగాణ సీఎస్ కు రూ.10 వేలు జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు

Telangana high court fined CS Somesh Kumar
  • 2016లో జీవో.123 జారీ
  • జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు
  • కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు
  • రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీఎస్
పలు పిటిషన్ల విచారణకు హాజరు కావడంలేదంటూ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా కౌంటర్లు దాఖలు చేయాలని తాము ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అభిశంసించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎస్ సోమేశ్ కుమార్ గత నాలుగేళ్ల కాలంలో కౌంటర్లు దాఖలు చేయలేదని స్పష్టం చేసిన కోర్టు... ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది.

ఈ జరిమానాను ప్రధానమంత్రి కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని పేర్కొంది. అంతేకాదు, తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2022 జనవరి 24కి వాయిదా వేసింది.

 2016లో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం జీవో నెం.123 జారీ అయింది. సాగునీటి పథకాలకు భూసేకరణ నిమిత్తం అప్పట్లో ఈ జీవో తీసుకువచ్చారు. అయితే ఈ జీవోకు వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రతి సందర్భంలోనూ కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీఎస్ ను కోర్టు ఆదేశిస్తూ వస్తోంది. వ్యక్తిగతంగానూ హాజరు కావాలని సూచిస్తోంది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో తాజాగా జరిమానా విధించింది.
Somesh Kumar
CS
Fine
TS High Court

More Telugu News