Sukhesh Chandrasekhar: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో స్నేహం కోసం ఘరానా మోసగాడు సుఖేశ్ ఏం చేశాడంటే...!

  • కటకటాల వెనుక ఘరానా మోసగాడు సుఖేశ్
  • రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి రూ.200 కోట్లు వసూలు
  • జాక్వెలిన్ స్నేహం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు
  • జాక్వెలిన్ కు ఖరీదైన గిఫ్టులు
How Sukesh tries to woo Jacqueline Fernadez

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానంటూ వారి భార్యల నుంచి రూ.200 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే ఈడీ విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాన్ బాక్సీ ప్రమోటర్ల భార్యల నుంచి రాబట్టిన డబ్బుతో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన విషయం బయటికి వచ్చింది.

అయితే, సుఖేశ్ వంటి వంచకుడితో జాక్వెలిన్ కు స్నేహం ఎలా కుదిరిందన్నది ఆశ్చర్యానికి గురచేసే అంశం. ఈడీ విచారణలో ఈ అంశం కూడా వెల్లడైంది. సుఖేశ్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మోసాలు చేయడంలో దిట్ట. తాను కేంద్రమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ జాక్వెలిన్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముతాతిల్ కు తరచుగా ఫోన్ చేసేవాడు. తనను తాను శేఖర్ రత్నవేలు అని పరిచయం చేసుకున్న సుఖేశ్... అమిత్ షా కార్యాలయం ఫోన్ నెంబర్ ను స్ఫూఫింగ్ చేసి కాల్ చేసేవాడు.

ఆ విధంగా జాక్వెలిన్ తో పరిచయం పెంచుకున్న సుఖేశ్.... తాను జయలలిత, సన్ టీవీ అధినేతలకు బంధువునని చెప్పాడు. ఇక జాక్వెలిన్ తనతో సన్నిహితంగా మెలుగుతుండడంతో ఆమెను సంతోష పెట్టేందుకు ఖరీదైన కార్లు కూడా బహూకరించినట్టు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 7న అరెస్ట్ అయ్యేంత వరకు జాక్వెలిన్ తో అతడి సాన్నిహిత్యం కొనసాగింది.

ఇంతకంటే ఆసక్తి కలిగించే విషయం మరొకటి ఉంది. సుఖేశ్ కు సహకరించిన పింకీ ఇరానీని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి జాక్వెలిన్ ను తనతో సాన్నిహిత్యానికి ఒప్పించే బాధ్యతను సుఖేశ్ తన సన్నిహితురాలు వంటి పింకీ ఇరానీకి అప్పగించాడు. అందుకోసం పింకీకి సైతం కోట్లలో డబ్బు, విలువైన కానుకలు ముట్టచెప్పాడు. కానీ జాక్వెలిన్ ను సుఖేశ్ తో స్నేహానికి ఒప్పించడంలో పింకీ ఇరానీ విఫలమైంది. పింకీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జాక్వెలిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాతే అమిత్ షా ఆఫీసు ఫోన్ నెంబరును ఉపయోగించుకుని జాక్వెలిన్ తో ఫ్రెండ్షిప్ సంపాదించినట్టు తెలిసింది.

ఆమెతో కలిసి తిరగడం కోసం సుఖేశ్ ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఖరీదైన కానుకలు ఇవ్వడమే కాదు, ఆమె ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాలు ఏర్పాటు చేసేవాడు. జాక్వెలిన్ సోదరి గెరాల్డైన్ ఫెర్నాండెజ్ కు ఓసారి 1.50 లక్షల డాలర్లు, జాక్వెలిన్ సోదరుడు వారెన్ ఫెర్నాండెజ్ కు రూ.15 లక్షల నగదు పంపాడు.

కాగా, ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు జాక్వెలిన్ ను కూడా ప్రశ్నించడం తెలిసిందే. విచారణలో సుఖేశ్ అంటే ఎవరన్న జాక్వెలిన్... తనకు శేఖర్ రత్నవేలుగానే అతడు పరిచయం అని వెల్లడించింది. దీన్నిబట్టే అతడు బాలీవుడ్ భామను ఎంతగా నమ్మించాడో అర్థమవుతోంది.

బాలీవుడ్ లో ఎంతోమంది భామలు ఉండగా, జాక్వెలిన్ అంటే పడిచచ్చిపోయే సుఖేశ్... ఆమెకు 'ఎస్ప్యులా' అనే అశ్వాన్ని కూడా బహూకరించాడు. లూయిస్ విటోన్, గుస్సి, షేనెల్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉపకరణాలను కానుకగా ఇచ్చాడు. ఇవే కాదు, రెండు జతల వజ్రాల చెవి కమ్మలు, పలు విలువైన రంగురాళ్లు పొదిగిన హెర్మిస్ బ్రేస్ లెట్ కూడా జాక్వెలిన్ కు ఇచ్చాడు. రూ.10 కోట్ల విలువైన మిని కూపర్ కారును సైతం తన మనసు దోచిన జాక్వెలిన్ కు సమర్పించుకున్నాడు.

వీళ్లిద్దరూ ఓసారి చెన్నైలోని ఓ హోటల్ లో కలిసినట్టు వెల్లడైంది. అయితే పలుమార్లు ఈడీ విచారణల తర్వాతే ఆమెకు సుఖేశ్ నిజస్వరూపం గురించి బోధపడినట్టు తెలుస్తోంది.

More Telugu News