parents: టీకాల కోసం చిన్నారులను విదేశాలకు తీసుకెళుతున్న తల్లిదండ్రులు

  • తమ కంటిపాపలను కాపాడుకునే యత్నం
  • ఎంత ఖర్చు అయినా వెనుకాడని తత్వం
  • 12 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు అత్యవసరం కాదు
  • జాతీయ సాంకేతిక సలహా మండలి అభిప్రాయం
parents taking kids to abroad for covid vaccination

దేశంలో చిన్నారులకు కరోనా రక్షక టీకాలను ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో.. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను టీకాల కోసం విదేశాలకు తీసుకెళుతున్నారు. గుజరాత్ లోని నరన్ పురకు చెందిన దంపతులు రాజ్ దీప్ బ్రహ్మదత్, సిద్ధి దంపతులకు ఐదేళ్ల వయసున్న కవల పిల్లలు (సర్వ, సత్వ) ఉన్నారు. ఇటీవలే వారు 19 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. కష్టపడి అంత ఖర్చు పెట్టుకుని అమెరికాకు వెళ్లింది వారి చిన్నారులకు టీకాలు ఇప్పించుకునేందుకే. ఈ చిన్నారులు అమెరికాలోనే జన్మించడంతో వారికి ఆ మార్గం తోచింది. కరోనా నుంచి తమ కవలలను కాపాడుకునేందుకు ఇదే సరైన మార్గం అనిపించినట్టు సిద్ధి తెలిపారు.

‘‘కరోనా రెండో విడతలో మా కుటుంబంలో ఒకరిని నష్టపోయాం. పాఠశాలలు తిరిగి తెరవడంతో మా పిల్లలకు టీకాలు ఇప్పించిన తర్వాతే వారిని పంపించాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే మేము వారి వారిని రక్షించుకోగలం’’ అని రాజ్ దీప్ చెప్పారు.

వీరు మాత్రమే కాదు.. గుజరాత్ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత ఉన్నవారు మరికొందరు సైతం ఇదే మార్గాన్ని అనుసరిస్తుండడం గమనార్హం. అబిషేక్ పటేల్ అనే వజ్రాల వ్యాపారి సైతం తన ఆరేళ్ల కుమారుడు హ్రిదాన్ ను ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు తీసుకెళ్లి మరీ టీకా ఇప్పించారు. ఇందుకోసం ఆయనకు రూ.2.28 లక్షలు ఖర్చయింది.

మరోవైపు మనదేశంలో 12 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు ఇవ్వాల్సినంత అత్యవసం ఏమీలేదని టీకాలకు సంబంధించిన జాతీయ సాంకేతిక సలహా మండలి భావిస్తోంది. 12 ఏళ్లలోపు చిన్నారుల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం, వ్యాధి తీవ్రత వారిలో తక్కువగా ఉండడంతో అత్యవసరం కాదని భావిస్తున్నామని, దీనిపై తమ ప్యానెల్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జాతీయ సాంకేతిక సలహా మండలి సభ్యుడు ఒకరు చెప్పడం గమనార్హం. నిపుణుల సూచన ప్రకారమే ముందుకు వెళతామని, ఈ విషయంలో తొందరపడబోమని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ సైతం స్పష్టం చేశారు.

More Telugu News