covid-19: ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చే వరకూ విమానాశ్రయంలోనే ప్రయాణికుల నిలుపుదల!

passengers from non risk countries to wait for result at Hyderabad airport
  • రిస్క్ లేని దేశాల నుంచి వచ్చే వారందరికీ ఇదే నియమం
  • హైదరాబాద్ విమానాశ్రయంలో అమలు
  • తెలంగాణ సర్కారు నిర్ణయం
రిస్క్ లేని దేశాల నుంచి వచ్చే వారితో తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో సర్కారు కట్టుదిట్టంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కేవలం రెండు శాతం మందినే ర్యాండమ్ గా అధికారులు ఎంపిక చేసి వారి నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం పంపిస్తున్నారు. అనంతరం వారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

ఇక పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. పైగా పాజిటివ్ కేసులు కేంద్ర సర్కారు ప్రకటించిన రిస్క్ లేని దేశాల నుంచి వచ్చే వారిలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. దీంతో ఇలా అయితే లాభం లేదనుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రిస్క్ లేని దేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే ప్రతీ ఒక్కరి నుంచి నమూనాలను తీసుకుని ఫలితం వచ్చే వరకు అక్కడే ఉంచేయాలని ఆదేశించింది. ఆదివారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. గత రెండు వారాల చేదు అనుభవాలే ఈ మార్పునకు కారణం.
 
ప్రయాణికులు తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి తెలివిగా తప్పించుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన వారిని పట్టుకోవడం తలనొప్పిగా తయారైంది. దీనికోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ రకం డెల్టా రకంతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. కనుక ఇకపై ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని, ఫలితం వచ్చే వరకు అక్కడే వేచి ఉండక తప్పదు.

హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి మరో విమానంలో వేరే ప్రాంతాలకు వెళ్లేవారికీ ఇదే నిబంధన అమలు చేయనున్నారు. పాజిటివ్ గా తేలితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తారు. లేదంటే హోమ్ క్వారంటైన్ లో ఉంటామంటే అంగీకరించి వారిపై నిఘా పెట్టనున్నట్టు ప్రజారోగ్య విభాగం సంచాలకులు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కేసులు 153కు చేరుకోగా.. తెలంగాణలో 20కి పెరిగాయి.
covid-19
corona
omicron
hyderabad airport
samshabad
rtpcr
detained
positive

More Telugu News