Basavaraj Bommai: కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు తప్పదా?.. ఊహాగానాలకు తావిస్తున్న బొమ్మై వ్యాఖ్యలు

  • సొంత నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ భావోద్వేగం
  • పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదన్న సీఎం
  • మీ ప్రేమ ఒక్కటీ చాలన్న బొమ్మై
No Post Permanent Karnataka Chief Minister Triggers Rumours Of His Exit

కర్ణాటకలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు తప్పదా?.. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.

ముఖ్యమంత్రి బొమ్మై తన సొంత నియోజకవర్గమైన షిగ్గాన్‌లో నిన్న కిట్టూర్ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవులు సహా ఈ సృష్టిలో మనకు ఏదీ శాశ్వతం కాదని అన్నారు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదని, ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కాదని అన్నారు. ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకునే నడుచుకుంటానని చెప్పి సీఎం మార్పుపై సంకేతాలిచ్చారు.

నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని అన్నారు. గతంలో హోంశాఖ మంత్రిగా, సాగునీటి మంత్రిగా పనిచేశానని పేర్కొన్న సీఎం.. తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్‌ను మాత్రమేనని, పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు.

గొప్ప విషయాలు చెప్పడానికి ఏమీ లేవని, మీరు ఆశించినట్టుగా తాను బతికితే చాలని, మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదని తాను భావిస్తానని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదన్న సంకేతాలకు నిదర్శనమని పలువురు చెబుతున్నారు.

More Telugu News