Hyderabad: హైదరాబాద్‌లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న జనం

  • ఆదిలాబాద్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతల నమోదు
  • సెంట్రల్ యూనివర్సిటీలో 8.2 డిగ్రీలకు పడిపోయిన వైనం
  • ఉత్తర, ఈశాన్య ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలుల వల్లనేనన్న వాతావరణశాఖ
Mercury dips in Hyderabad

తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేని జనం వణుకుతున్నారు. సూర్యుడు కాస్తంత బయటకి వస్తే తప్ప ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ నిన్న విచిత్రంగా అక్కడి కంటే హైదరాబాద్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సెంట్రల్ యూనివర్సిటీలో 8.2, రాజేంద్రనగర్‌లో 9.1, బీహెచ్‌ఈఎల్‌లో 9.7, గచ్చిబౌలిలో 11.5, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.2, బండ్లగూడలో 11.8, మాదాపూర్‌లో 13.6, గోల్కొండలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ముషీరాబాద్‌లో కాస్తంత ఎక్కువగా 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాలనుంచి వీస్తున్న చలి గాలుల కారణంగానే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

More Telugu News