CM KCR: యాసంగిలో కిలో వడ్లు కూడా కొనలేం... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదు: సీఎం కేసీఆర్

  • కేంద్రం ప్రమాదకర విధానాలు అవలంబిస్తోందన్న కేసీఆర్
  • రైతాంగాన్ని కాపాడుకుంటామని వెల్లడి
  • జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు నిర్దేశం
  • ధాన్యం కొనబోవడంలేదన్న అంశంపై అవగాహన కల్పించాలని సూచన
CM KCR key decisions on paddy procurement

ధాన్యం సేకరణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సర్కారు ఈ యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమని పదేపదే చెబుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు తాము ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.

ధాన్యం కొనుగోలు చేయబోమన్న అంశం పట్ల రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలను స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రం అమలు చేయలేదని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఇకపైనా ఈ విధానాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News