Tamilnadu: స్కూల్​ లో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం.. తమిళనాడులో విషాదం

3 Students Killed In a Private School Due To Wall Collapsed
  • తిరునల్వేలిలోని షేఫర్ సెకండరీ బాయ్స్ స్కూల్ లో ప్రమాదం
  • కూలిపోయిన టాయిలెట్ గోడ.. ముగ్గురికి గాయాలు
  • స్కూలు బాగా పాతబడిపోయిందన్న పోలీసులు
  • విద్యార్థి సంఘాల ఆందోళన.. ఫర్నిచర్ ధ్వంసం
స్కూల్ లోని గోడ కూలి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర విషాదం తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న షేఫర్ హయ్యర్ సెకండరీ బాయ్స్ ప్రైవేట్ స్కూల్ లో ఇవాళ ఉదయం సంభవించింది. విద్యార్థులు మూత్రవిసర్జనకు వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది.

చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడే ఉందని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఇటీవలే స్కూల్ ను తెరిచారన్నారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించిందని తెలిపారు.

ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, అప్పుడే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తిరునల్వేలి సిటీ పోలీస్ కమిషనర్ ఎన్కే సెంథమారై కణ్నన్ చెప్పారు. కాగా, ఘటనపై పలు విద్యార్థి సంఘాలు స్కూలు వద్ద ఆందోళన చేశాయి. పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి.
Tamilnadu
Tirunalveli
Scholl
Wall Collapse
Crime News

More Telugu News