Omicron: మానవదేహంలో డెల్టా వేరియంట్ కంటే 70 రెట్ల వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్

  • అనేక దేశాల్లో ఒమిక్రాన్ కలకలం
  • హాంకాంగ్ వర్సిటీ తాజా పరిశోధన
  • వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్
  • అధిక ముప్పు కలిగించే అవకాశం ఉందని వెల్లడి
Omicron spreads seventy times faster than Delta variant

కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని ఒమిక్రాన్ వేరియంట్ గా రూపాంతరం చెందడం తెలిసిందే. ఒమిక్రాన్ లో దాదాపు 32 జన్యు ఉత్పరివర్తనాలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ చూస్తుండగానే అనేక దేశాలకు పాకిపోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే 60కి పైగా దేశాలకు వ్యాపించింది.

తాజాగా దీనిపై హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కొన్నినెలల కిందట విలయతాండవం చేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మానవదేహంలోకి ప్రవేశించిన తర్వాత 70 రెట్ల వేగంతో ఇన్ఫెక్షన్ ను కలుగజేస్తోందని గుర్తించారు. కొందరిలో మాత్రం ఇది ఏమంత తీవ్ర ప్రభావం చూపడంలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

వ్యక్తుల నుంచి కణజాలం సేకరించిన హాంకాంగ్ పరిశోధకులు... 24 గంటల తర్వాత ఒమిక్రాన్ మానవ శ్వాస నాళాలను డెల్టా కంటే 70 రెట్లు వేగంగా కమ్మేసిందని తెలిపారు. శరీరంలోకి గాలి ప్రవేశించే మార్గాలను ఉపయోగించుకుని ఇది వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

అయితే ఊపిరితిత్తుల కణజాలంపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటోందని, అందుకే ఈ కొత్త వేరియంట్ కారణంగా ప్రస్తుతానికి తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం కావడంలేదని అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్ తో పోల్చితే ఊపిరితిత్తుల్లోకి 10 రెట్లు నెమ్మదిగా ప్రవేశిస్తోందని వెల్లడించారు.

ఒమిక్రాన్ తీవ్రత అనేది వైరస్ విస్తరణపైనే కాకుండా, వ్యాధినిరోధక శక్తి ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపైనా ఆధారపడి ఉంటుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ మైకేల్ చాన్ చి వాయ్ తెలిపారు. వేగంగా సంక్రమించే వైరస్ అత్యధికులకు సోకుతుందని, ఆపై తీవ్ర వ్యాధి లక్షణాలు కలిగిస్తూ అత్యధిక మరణాలకు దారితీస్తుందని వివరించారు. వ్యాక్సిన్లు కలిగించే నిరోధక శక్తి నుంచి ఒమిక్రాన్ వేరియంట్ పాక్షికంగా తప్పించుకుంటున్నట్టు ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయని, ఓవరాల్ గా చూస్తే ఒమిక్రాన్ తో ముప్పు గణనీయంగా ఉండబోతోందని చాన్ పేర్కొన్నారు.

More Telugu News