Team India: టీమిండియాకు మరో భారీ షాక్.. రోహిత్ టెస్టులకు దూరమైతే, ఇప్పుడు కోహ్లీ వన్డేలకు దూరం!

Virat to Opt Out Of South Africa ODI Series
  • దక్షిణాఫ్రికాతో వన్డేల నుంచి తప్పుకొన్న విరాట్
  • వామికా బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమేనంటూ బీసీసీఐకి విజ్ఞప్తి
  • ఫ్యామిలీతో గడిపేందుకే రిక్వెస్ట్ చేశాడన్న బీసీసీఐ అధికారి
దక్షిణాఫ్రికాతో టూర్ కు ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా తొడ కండరాల గాయం పాలైన రెడ్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్టులకు మొత్తం దూరమైన సంగతి తెలిసిందే. దీంతో టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని టీమ్ మేనేజ్ మెంట్ నిన్న ప్రకటించింది. తాజాగా వన్డేలకు కోహ్లీ దూరమయ్యాడు.

వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకొన్నట్టు తెలుస్తోంది. నిన్న ముంబైలో జరిగిన ట్రైనింగ్ సెషన్ కు అతడు హాజరు కాలేదని, వన్డే సిరీస్ కు దూరంగా ఉంటానంటూ బీసీసీఐకి తెలియజేశాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. తన కూతురు వామికా తొలి పుట్టినరోజును తన భార్య అనుష్క శర్మతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అతడు భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేప్ టౌన్ లో మూడో టెస్టు సమయంలోనే జనవరి 11న వామిక తొలి పుట్టిన రోజు జరుపుకోనుంది. ఆరోజునే మూడో టెస్టు ప్రారంభం కానుంది. జనవరి 15 వరకు మ్యాచ్ జరగనుంది.

అప్పుడు పుట్టినరోజు వేడుకలకు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు కాబట్టి.. వన్డే సిరీస్  సమయంలో ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు ఇష్టపడుతున్నారని ఆ అధికారి అన్నారు. ‘‘అవును, కోహ్లీ బ్రేక్ అడిగాడు. కాబట్టి వన్డేలకు అతడు అందుబాటులో ఉండడు’’ అని చెప్పారు. అయితే, పుట్టినరోజు అయిపోయాక వారానికి సెలబ్రేషన్స్ పేరుతో వన్డేలకు దూరమవడం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పించారు కాబట్టే.. అతడు వన్డేలకు దూరమవుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి.
Team India
Virat Kohli
Rohit Sharma
South Africa

More Telugu News