PRC Report: పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్ కు సమర్పించిన సీఎస్ సమీర్ శర్మ

  • పీఆర్సీపై కమిటీ నివేదిక
  • సీఎం జగన్ ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
  • పీఆర్సీపై త్వరలో సీఎం నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
  • ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల భారం పడనుందని వివరణ
CS Sameer Sharma handed over PRC Report to CM Jagan

ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎంకు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందించామని తెలిపారు. నివేదికను పరిశీలించిన అనంతరం పీఆర్సీపై సీఎం జగన్ మరో మూడ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

పీఆర్సీ నివేదికను వెబ్ సైట్ లోనూ ఉంచుతామని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఫిట్ మెంట్ పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్ మెంట్ ను కూడా పరిశీలించామని వెల్లడించారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మేర అదనపు భారం పడనుందని అన్నారు.

11వ వేతన సంఘం సిఫారసులపై రూపొందించిన ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి...

సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పలు అంశాలను ఈ నివేదికలో పొందుపరిచింది. ఉద్యోగుల లబ్దికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా సీఎస్ కమిటీ ప్రస్తావించింది. 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరినట్టు వివరించారు.

2018-19లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 84 శాతం ఉండగా... 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరినట్టు సీఎస్ కమిటీ నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్ల వ్యయం 2020-21 నాటికి 36 శాతానికి పెరిగిందని వివరించారు. 2020-21లో తెలంగాణలో జీతాలు, పెన్షన్ల వ్యయం 21 శాతమేనని ఆ నివేదికలో ప్రస్తావించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేసింది.

More Telugu News