Kurasala Kannababu: వర్షం కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: మంత్రి కన్నబాబు

  • తాడేపల్లిలో కన్నబాబు ప్రెస్ మీట్
  • ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించామని వెల్లడి
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని వివరణ
  • మూడు వారాల్లో చెల్లింపులు చేస్తున్నామని స్పష్టీకరణ
AP Minister Kannababu press meet

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించామని వెల్లడించారు.

రైతులు తమ పంట అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకుంటే చాలని, పంట కొనుగోలు లావాదేవీలన్నీ అక్కడి నుంచే నిర్వహించుకోవచ్చని వివరించారు. కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, మూడు వారాల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని కన్నబాబు తెలిపారు.

దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొంటామని మంత్రి స్పష్టం చేశారు. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కన్నబాబు వెల్లడించారు.

More Telugu News