త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న లాలూ తనయుడు తేజస్వి యాదవ్

08-12-2021 Wed 16:21
  • రేపు నిశ్చితార్థం
  • ఢిల్లీలో కార్యక్రమం
  • హస్తిన చేరిన లాలూ కుటుంబం
  • లాలూ రాజకీయ వారసుడిగా తేజస్వి యాదవ్
Tejaswi Yadav set to tie the knot soon
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నకుమారుడు తేజస్వి యాదవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 32 ఏళ్ల తేజస్వి యాదవ్ రేపు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. సంప్రదాయ సగాయ్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాలూ కుటుంబం, బంధుమిత్రులు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే, తేజస్వి యాదవ్ జీవిత భాగస్వామి కాబోతున్న అమ్మాయి ఎవరన్నది తెలియరాలేదు.

లాలూ, రబ్రీ దేవి దంపతులకు 9 మంది సంతానం కాగా, వారిలో తేజస్వి ఒక్కడికే ఇప్పటివరకు పెళ్లి కాలేదని ఆర్జేడీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి భాయ్ వీరేంద్ర వెల్లడించారు. రేపటి నిశ్చితార్థం కార్యక్రమంలో పెళ్లి తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది. లాలూ వారసుడిగా రాజకీయాల్లో తేజస్వి ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

ఓ దశలో క్రికెటర్ కావాలని కోరుకున్న తేజస్వి... ఐపీఎల్ లోనూ ఓ జట్టుకు ఎంపికయ్యారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. అయితే, బీహార్ రాజకీయాల్లో యువనేతగా ఎదిగారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వినే. ఆయన రాఘవ్ పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.