బ్రిటన్‌లో మొదలైన ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి.. 336 కేసుల నమోదు

08-12-2021 Wed 09:34
  • కొత్త కేసుల్లో ఎవరికీ లేని అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర
  • సామాజిక వ్యాప్తికి ఇది అద్దం పడుతోందన్న మంత్రి
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Omicron variant began social spread in Britain
దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు బ్రిటన్‌ను భయపెడుతోంది. అక్కడ ఇప్పటికే సామాజిక వ్యాప్తి మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు 336 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కొత్త కేసుల్లో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని, దీనిని బట్టి సామాజిక వ్యాప్తి మొదలైనట్టు అర్థం చేసుకోవచ్చని అన్నారు.

అయితే, ఈ వేరియంట్ ప్రమాదకారా? కాదా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ వేరియంట్‌పై టీకాలు ఎంతమేరకు పనిచేస్తాయన్న విషయం కూడా స్పష్టంగా తెలియదన్నారు. శాస్త్రవేత్తలు దీనిపై ఓ నిర్ధారణకు వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ తాము వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.