కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసిన టీవీ సీరియల్ నటి.. పీఎస్ కు తీసుకెళ్లిన పోలీసులు!

08-12-2021 Wed 09:12
  • శంషాబాద్ ప్రాంతంలో బైక్ ను ఢీకొట్టిన లహరి
  • తీవ్రంగా గాయపడ్డ బైక్ పై వెళ్తున్న వ్యక్తి
  • లహరికి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన పోలీసులు
Serial actress Lahari makes accident
ఎన్నో సీరియల్స్ లో నటించిన నటి లహరి బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితమే. సంప్రదాయబద్ధంగా కనిపించే లహరి తన నటనతో సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే, ఆమె మరో విషయంలో వార్తల్లో నిలిచింది.

 హైదరాబాదు శివారు శంషాబాద్ ప్రాంతంలో ఆమె యాక్సిడెంట్ చేసింది. స్వయంగా కారు నడుపుతున్న లహరి... బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడున్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి, అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో లహరి తీవ్ర భయాందోళనలకు గురైంది. చుట్టూ గుమికూడిన జనాలను చూసి భయంతో ఆమె కారు కూడా దిగలేదు. దీంతో, పోలీసులు ఆమెను కారుతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమో అనే అనుమానాలతో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయించారు. అయితే పరీక్షలో ఆమె మద్యం తీసుకున్నట్టు తేలలేదు. మరోవైపు, గాయపడ్డ వ్యక్తి తరపున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో... ఈ ఉదయం పదకొండు గంటలకు స్టేషన్లో హాజరుకమ్మని  చెప్పి.. పోలీసులు ఆమెను స్టేషన్ నుంచి పంపించేశారు.