హైదరాబాదులో వాటర్ ట్యాంకులో శవం... అవే నీళ్లు తాగిన ప్రజలు... కలకలం!

07-12-2021 Tue 22:03
  • రీసాలగడ్డలో ఘటన
  • ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది
  • లోపల శవాన్ని గుర్తించిన వైనం
  • కొన్ని రోజులుగా అవే నీళ్లు సరఫరా
Dead body found in a water tank in Hyderabad
హైదరాబాదులో జలమండలి వాటర్ ట్యాంకులో శవం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంకును  శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అందులో ఓ వ్యక్తి శవం కనిపించింది. దాంతో వారు హడలిపోయారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.

అయితే శవం ఉన్న ట్యాంకు నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్నిరోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారు చర్చించుకుంటున్నారు.

కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ట్యాంకు నుంచి శవాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఇది హత్యా లేక, ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.