పునరాగమనంపై సంకేతాలు ఇస్తున్న యువరాజ్ సింగ్... అభిమానుల్లో ఉత్సాహం

07-12-2021 Tue 20:51
  • రెండేళ్ల కిందట క్రికెట్ కు వీడ్కోలు
  • ఐపీఎల్ లోనూ కనిపించని యువీ
  • బిగ్ సర్ ప్రైజ్ ఇస్తానంటూ తాజా ప్రకటన
  • క్రికెట్ లోకి మళ్లీ వస్తాడంటూ ఊహాగానాలు
Yuvraj Singh set to surprise his fans this month
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. ఈ పంజాబ్ డాషింగ్ ఆల్ రౌండర్ అనేక విజయాల్లో ముఖ్యభూమిక పోషించాడు. అయితే క్యాన్సర్ బారినపడడం యువీ కెరీర్ ను మసకబార్చింది. 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత యువరాజ్ క్యాన్సర్ కు గురయ్యాడు. అమెరికాలో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నప్పటికీ మునపటి వాడి లోపించింది.

టీమిండియాలో అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే లభించడంతో రెండేళ్ల కిందట క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ లోనూ ఆడడంలేదు. యువరాజ్ కు ప్రస్తుతం 39 ఏళ్ల వయసు. గేల్, ధోనీ వంటి సీనియర్లు ఇంకా లీగ్ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు.  ఈ నేపథ్యంలో క్రికెట్ లోకి పునరాగమనంపై యువీ కొన్నాళ్లుగా ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ కు సర్వం సిద్ధం అంటూ తాజాగా ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఈ సంవత్సరమే అభిమానులందరికీ పెద్ద సర్ ప్రైజ్ ఇస్తానని వెల్లడించాడు.

క్రికెట్ పిచ్ పైకి మరోసారి రావాలని ఉందని ఇటీవల చేసిన పోస్టుతో అభిమానులు ఎంతో సంతోషం వెలిబుచ్చారు. తాజా వీడియోతో వారిలో మరింత ఆసక్తి కలుగుతోంది. కెరీర్ గురించి యువీ ఏం ప్రకటన చేయబోతున్నాడన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.