ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం.. ఇక స్పందన రాదనే ఈ ఉద్యమం: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు

07-12-2021 Tue 12:47
  • ఇవాళ ప్రారంభమైన ఏపీ జేఏసీ తొలిదశ ఉద్యమం
  • ఆఫీసులకు నల్లబ్యాడ్జీలతో హాజరైన ఉద్యోగులు
  • భోజన విరామ సమయాల్లో ధర్నాలు
AP JAC Agitation On PRC
పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అంత భయమెందుకని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని, అయినా కూడా సర్కారు నుంచి స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.

ఇక స్పందన రాదని తెలుసుకునే ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ఇవాళ ప్రారంభమైంది. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు చేసి నిరసన తెలియజేయనున్నారు. కర్నూలులో జరిగిన నిరసనల్లో బొప్పరాజు పాల్గొన్నారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని తాము ఇరుకునపడేయలేదని బొప్పరాజు గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ సంయమనంతో ఉన్నామన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మొక్కుబడి కోసం ఒకట్రెండు సమావేశాలను నిర్వహించి చేతులు దులుపుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వల్ల ఉద్యోగులకు కలిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని ఆయన అన్నారు.