మనస్పర్థలతో దూరమైన భార్య.. రప్పించేందుకు క్షుద్రపూజలు.. కొత్తగూడెం జిల్లాలో కలకలం

06-12-2021 Mon 09:05
  • స్నేహితుల మాటలు విని క్షుద్రపూజలు
  • విషయం తెలిసి చితకబాదిన భార్య బంధువులు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన పూజల వీడియోలు
Husband approach black magic for reunite with wife
మనస్పర్థలతో దూరమైన భార్యను తిరిగి చెంతకు రప్పించేందుకు ఓ భర్త క్షుద్రపూజలను ఆశ్రయించాడు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శేఖరంబంజరకు చెందిన కారు డ్రైవర్‌కు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య విభేదాలు పొడసూపాయి. అవి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు.

అయినప్పటికీ ఇద్దరి మనసులు కలవలేదు. ఈ క్రమంలో 5 నెలల క్రితం యువకుడు వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి మణుగూరులో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. మరోవైపు, ఇటీవల ఇంటికి తిరిగివచ్చిన యువకుడు భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అయితే, ఆమె మనసు మారి తిరిగి కాపురానికి రావాలంటే క్షుద్రపూజలు ఒక్కటే మార్గమని స్నేహితులు చెప్పారు. వారి మాటలు నమ్మిన యువకుడు రెండు నెలల క్రితం ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. రూ. 30 వేలు ఇచ్చి పూజలు చేయించాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే భార్య నుంచి ఫోన్ రావడంతో సంతోషంతో మణుగూరు వెళ్లాడు.

మరోవైపు అప్పటికే అతడి క్షుద్రపూజల వ్యవహారం వెలుగుచూడడంతో యువతి బంధువులు అతడిని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు. భార్యాభర్తలిద్దరినీ పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. అప్పటి నుంచి వారిద్దరూ విడిగా జీవిస్తున్నారు. కారు డ్రైవర్ క్షుద్రపూజలకు సంబంధించిన దృశ్యాలు నిన్న సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి.