Mamata Banerjee: చూస్తుంటే బీజేపీతో మమత కుమ్మక్కయ్యారని అనిపిస్తోంది: చత్తీస్‌గఢ్ సీఎం
- మమత పోరాటం ఎవరితో
- అధికార పార్టీతోనా? సహ ప్రతిపక్షంతోనా?
- ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ మూల స్తంభం
- గోవాలో పోటీ వెనక విపక్ష ఓట్లను చీల్చే కుట్ర
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ ఎక్కడుందంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం.. కాంగ్రెస్‌ను కాదని ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని మమత భావిస్తున్నారని అన్నారు. కలలను నెరవేర్చుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తామన్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షంగా ఆమె ఎవరితో పోరాడాలనుకుంటున్నారన్నదే ప్రశ్న అని అన్నారు. అధికారంలో ఉన్న వారితోనా? లేదంటే సహ ప్రతిపక్షాలతోనా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ పార్టీయే మూల స్తంభమని స్పష్టం చేశారు. ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో చర్చలు జరిపిన అనంతరం మమత మాట్లాడుతూ యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించారని గుర్తు చేసిన భూపేష్.. అంతకుముందు ప్రధానితో మాట్లాడిన ఆమె దేని గురించి చర్చించారో మాత్రం చెప్పడం లేదన్నారు. ఈ పరిణామాలను బట్టి బీజేపీ, తృణమూల్ కుమ్మక్కయినట్టు కనిపిస్తోందన్నారు. గోవాలో తృణమూల్‌కు బలం లేకపోయినా అక్కడ పోటీకి దిగడం వెనక ప్రతిపక్షాల ఓట్లను చీల్చే కుట్ర దాగి ఉందని చత్తీస్‌గఢ్ సీఎం ఆరోపించారు.