'పుష్ప' యూనిట్ కు అల్లు అర్జున్ సందేశం... వీడియో ఇదిగో!

05-12-2021 Sun 17:14
  • రేపు పుష్ప ట్రైలర్ రిలీజ్
  • ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మేకింగ్ వీడియో 
  • పర్యావరణ పరిరక్షణ కోరి బన్నీ సందేశం
  • ఈ నెల 17న వస్తున్న పుష్ప
Allu Arjun echo friendly message to Pushpa unit
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప. తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియో మొదట్లో అల్లు అర్జున్ పుష్ప చిత్రబృందానికి ఓ సందేశం ఇవ్వడం చూడొచ్చు.

"షూటింగ్ లొకేషన్ కు ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం. ఎవరు వాడిన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు అన్నీ ఎవరికి వారే తీసుకువచ్చి డస్ట్ బిన్ లో వేసేయండి. మనం రాకముందు ఈ ప్లేస్ ఎలా ఉందో మనం వెళ్లిన తర్వాత కూడా అలాగే ఉండాలి" అంటూ బన్నీ పర్యావరణ హితం కోరి పిలుపునిచ్చారు.

అంతేకాదు, ఈ వీడియోలో పుష్ప మేకింగ్ సీన్లు కూడా ఉన్నాయి. రేపు ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన మేకింగ్ వీడియో బన్నీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

పుష్ప చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అటవీ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమరవాణా ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయిక. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ పోషిస్తుండగా, మరో కీలకపాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.