Kandikonda: బాధాకరమైన పరిస్థితుల్లో టాలీవుడ్ లిరిక్ రైటర్... కేటీఆర్ ను సాయం కోరిన కుమార్తె

  • గతంలో అనేక హిట్ గీతాలు రాసిన కందికొండ
  • కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం
  • ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం
  • ఇంటి యజమాని ఖాళీ చేయమంటున్నాడని కుమార్తె వెల్లడి
Tollywood lyric writer Kandikonda daughter appeals for help

ఇడియట్ చిత్రంలో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే, పోకిరి చిత్రంలో గలగల పారుతున్న గోదారిలా... ఇటువంటి సూపర్ హిట్ గీతాలు ఎన్నో రాసిన టాలీవుడ్ లిరిక్ రైటర్ కందికొండ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యాల బారినపడి మరణం అంచులవరకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని మోతీనగర్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే తన తండ్రి ఆరోగ్య రీత్యా అద్దె ఇంట్లో ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, తమకు నివాసం కల్పించాలని కందికొండ కుమార్తె మాతృక మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. గతంలో చిత్రపురి కాలనీలో సొంత ఇంటి కోసం తన తండ్రి రూ.4.05 లక్షలు చెల్లించారని, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో మిగతా సొమ్ము చెల్లించలేకపోయామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇంటి యజమాని తమను ఖాళీ చేయమంటున్నాడని, ఈ నెల తర్వాత తమ పరిస్థితి ఏంటో అర్థంకావడంలేదని మాతృక ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపురి కాలనీలో కానీ, మరెక్కడైనా కానీ నివాసం కల్పించాలని కేటీఆర్ ను కోరారు.

"గతంలో మా నాన్న కిమ్స్ లో తీవ్ర అనారోగ్యానికి చికిత్స పొందుతున్నప్పుడు కూడా మీరే సాయపడ్డారు. ఆ సమయంలో కిమ్స్ లో నెల రోజులకుపైగా చికిత్స అందించారు. అదంతా మీ చలవే. ఇటీవల కూడా మెడికవర్ ఆసుపత్రిలో మా నాన్న వెన్నెముక సర్జరీ సమయంలోనూ మీ ఆఫీసు ఎంతో వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంది. ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి సర్జరీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మాకు చిత్రపురిలో నివాసం కల్పించాలని మా అమ్మ గతంలోనే మంత్రి హరీశ్ రావును కోరగా, ఆయన మంత్రి తలసానిని కలవాలని సూచించారు.

డియర్ కేటీఆర్ సర్... మీరు ఈ అంశంలోనూ మాకు సాయపడాలని కోరుకుంటున్నాను. మాకు నివాసం కల్పించండి" అంటూ కందికొండ మాతృక విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఆరోగ్యవంతుడయ్యాక సీఎం కేసీఆర్ పేర్కొనే 'బంగారు తెలంగాణ' కోసం రచనలు చేస్తారని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News