Chandrababu: ప్రాజెక్టు గేటుకు గ్రీజు కూడా వేయలేని జగన్ మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు ఫైర్

  • ఓట్లేసిన పాపానికి జనాల ప్రాణాలు తీస్తారా?
  • ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు విపత్తు సంభవించింది
  • పిచ్చి తుగ్లక్ మాదిరి జగన్ తయారయ్యారు
Chandrababu fires on Jagan

పరిపాలనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించడంపై చంద్రబాబు ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఓట్లేసిన పాపానికి జనాల ప్రాణాలు తీస్తారా? అని మండిపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు వరదలు వచ్చాయని... మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని... దీనికి బాధ్యులైన అందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ తప్పిదం వల్ల 62 మంది ప్రాణాలు కోల్పోయారని... ప్రజల్ని చంపేందుకు మీకు లైసెన్స్ ఎవరిచ్చారని మండిపడ్డారు. ఓ వైపు వరదల వల్ల రాష్ట్రంలో భయానక పరిస్థితి ఉంటే... మరోవైపు అసెంబ్లీలో తమపై దాడి చేశారని అన్నారు. సొంత జిల్లాలో పర్యటించిన జగన్ ఇంత వరకు ఏం చేశారని ప్రశ్నించారు.
 
రాష్ట్రం వరదల్లో ఉంటే.. అసెంబ్లీలో నా మొహం చూడాలని జగన్ అనడం ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తుందని చంద్రబాబు అన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు గేటు క్లోజ్ కాలేదని, దాంతో నీరు మొత్తం వృథాగా పోయిందని... ఈ సారి వరదలు వచ్చినప్పుడు అదే గేటు ఓపెన్ కాలేదని చెప్పారు. ఒక్క గేటుకు గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి... మూడు రాజధానులను నిర్మిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్ ల కోసమే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయలేదని అన్నారు.

కనీసం మృతదేహాలను కూడా ఇవ్వలేని దారుణ స్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. ఓ వైపు వరద బీభత్సం ఉంటే.. మరోవైపు సిగ్గులేకుండా ఆరోజు పెళ్లికి పోయిన ఘనత జగన్ దని దుయ్యబట్టారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చారని... ఇప్పుడు వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని అన్నారు.

ఓటీఎస్ పథకం మంచిదని జగన్ ఎలా చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంటే... ఓటీఎస్ కు రూ. 20 వేలు కట్టాలని ఎలా అంటారని అన్నారు. ఎవరూ డబ్బులు కట్టొద్దని... టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. జగన్ పిచ్చి తుగ్లక్ మాదిరి తయారయ్యారని... ఆయన వల్ల రాష్ట్రం సర్వనాశనమయిందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News