CJI NV Ramana: శ్రీకృష్ణ రాయబారం విఫలం కావడంతో ఎంతటి తీవ్ర పర్యవసానాలు జరిగాయో అందరికీ తెలుసు: సీజేఐ ఎన్వీ రమణ
- హైదరాబాదులో ఆర్బిట్రేషన్ సెంటర్ సదస్సు
- హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ
- మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించిన వైనం
- సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని వెల్లడి
- చివరి ప్రయత్నంగానే కోర్టుకు రావాలని సూచన
హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్-మీడియేషన్ సెంటర్ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక కేసుల్లో మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించారు. మధ్యవర్తిత్వం వల్ల పెద్ద సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వం విఫలమైతే చిన్న సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయని అన్నారు.
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు రాయబారం వహించాడని, కానీ ఆయన మధ్యవర్తిత్వం విఫలమైందని తెలిపారు. దాని ఫలితంగా ఎంతటి తీవ్ర పర్యవసానాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందేనని సీజేఐ ఎన్వీ రమణ వివరించారు. సాధారణ సమస్యలు సైతం ఇగోలు, పట్టింపులు, భేదాభిప్రాయాల వల్ల జటిలం అవుతుంటాయని, మధ్యవర్తిత్వం వల్ల ఇలాంటి కేసులు సులువుగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
న్యాయ వ్యవస్థల్లో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, ఏదైనా అంశంలో చివరి ప్రయత్నంగానే కోర్టుకు వస్తే బాగుంటుందన్నది తన అనుభవంతో చెబుతున్నానని వెల్లడించారు. కోర్టు విచారణల కారణంగా అనేక సంవత్సరాల సమయం వృథా అవుతుందని రమణ వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందని, సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు.
కాగా, లండన్, హాంకాంగ్, సింగపూర్, పారిస్ నగరాల్లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయని, ఆ తరహాలో హైదరాబాదులోనూ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సెంటర్ ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీల సహకారం ఎంతో ఉందని కొనియాడారు. కాగా, నేటి సదస్సులో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.