Rosaiah: ఆర్థికమంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా... రాజకీయ దురంధరుడు రోశయ్య రాజకీయ ప్రస్థానం ఇదే!

  • దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం రోశయ్య సొంతం
  • బడ్జెట్ వ్యవహారాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించిన రోశయ్య
  • నలుగురు సీఎంల వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అనుభవం
  • 1933లో గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య
  • కాంగ్రెస్ కు అత్యంత విధేయుడైన రోశయ్య తొలి పార్టీ స్వతంత్ర పార్టీ
Life story of Rosaiah

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు రోశయ్య గుండెపోటుతో మృతి చెందారు. తన మేథస్సుతో మాతృభూమికి ఎంతో సేవ చేసిన రోశయ్య 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు సేవలందించిన రోశయ్య అందరిలో విషాదాన్ని నింపుతూ వెళ్లిపోయారు. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలకు కట్టుబడి ఉండటం ఆయన గొప్పదనం.

గుంటూరు జిల్లాలోని వేమూరు (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ)లో 1933 జులై 4న రోశయ్య జన్మించారు. హిందూ వైశ్య సామాజికవర్గంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. 1950లో శివలక్ష్మిని ఆయన పెళ్లాడారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించిన ఆయన... తనకు ఎంతో ఇష్టమైన ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడం విశేశం. చిన్నప్పటి నుంచి కూడా రోశయ్యలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గుంటూరులో చదువుతున్న సమయంలోనే ఆయన విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. రోశయ్యలో ఒక మంచి వక్త కూడా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన రోశయ్య రాజకీయ జీవితం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. తొలుత ఆయన స్వతంత్ర పార్టీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత ఆచార్య ఎన్జీ రంగా అంటే ఆయనకు అంతులేని అభిమానం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోశయ్య 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 1989, 2004 లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు 1998లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

సుదీర్థకాలం పాటు రాష్ట్ర ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవం రోశయ్య సొంతం. ఆర్థికమంత్రిగా 16 సార్లు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డిల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేశారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీచర్లకు రిటైర్ మెంట్ బెనిఫిట్లను కల్పించిన ఘనత రోశయ్యదే. బడ్జెట్ తయారీలో రోశయ్య ఎంతో కఠినంగా వ్యవహరించేవారు. ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రుల సూచనలను కూడా పక్కన పెట్టిన ఘనత ఆయనది. అనవసరమైన ఖర్చులకు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు. ముఖ్యమంత్రులు సైతం ఆర్థికమంత్రిగా ఉన్న రోశయ్య నిర్ణయాలకు విలువను ఇచ్చేవారు.

వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రోశయ్య బాధ్యతలను స్వీకరించారు. ఏపీ 15వ ముఖ్యమంత్రిగా 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు బాధ్యతలను నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేశారు.  

1994 నుంచి 1996 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా రోశయ్య వ్యవహరించారు. 1978-79లో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. తన రాజకీయ జీవితంలో ఆర్ అండ్ బీ, హౌసింగ్, రవాణా, హోమ్, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం దాదాపు 60 ఏళ్ల పాటు కొనసాగింది. ఆంధ్ర యూనివర్శిటీ 2007లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అజాతశత్రువైన రోశయ్య మృతి అందరినీ కలచివేస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలందరూ రోశయ్య మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

More Telugu News