మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరిగింది: చంద్రబాబు

03-12-2021 Fri 20:54
  • ఇటీవల ఆకివీడు మున్సిపాలిటీకి ఎన్నికలు
  • టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • ఫలితాలపై పార్టీ పరంగా విశ్లేషణ
  • కష్టపడి పనిచేసేవారినే ప్రోత్సహిస్తామని స్పష్టీకరణ
Chandrababu held meeting with Akiveedu TDP leaders
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, అక్కడి టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను పట్టించుకోనవసరంలేదని, సహజంగానే అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ధనబలం, అక్రమకేసులతో గెలిచిందని ఆరోపించారు.

అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వంపై ఇప్పుడు ఉన్నంత ప్రజావ్యతిరేకత గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. కొన్నిప్రాంతాల్లో కొత్త నాయకులను ప్రోత్సహిస్తామని, కష్టపడి పనిచేస్తేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. చావోరేవో అనే రీతిలో తెగించి పోరాడేవాళ్లకే తమ మద్దతు ఉంటుందని అన్నారు.