ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడే దివ్యాంగురాలైన అవ్వని అవమానించారు: నారా లోకేశ్

03-12-2021 Fri 15:09
  • అనంతపురం జిల్లాలో ఓ దివ్యాంగ వృద్ధురాలి గోడు
  • పెన్షన్ తొలగించారంటూ పత్రికలో కథనం
  • అధికారుల తీరుపై లోకేశ్ ఆగ్రహం
  • దివ్యాంగురాలి పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్
Nara Lokesh questions YCP Govt
అనంతపురం జిల్లాకు చెందిన పుల్లమ్మ అనే మరగుజ్జు వృద్ధురాలికి భూమి ఉందంటూ పెన్షన్ నిలిపివేసినట్టు పత్రికలో కథనం వచ్చింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడే దివ్యాంగురాలైన అవ్వని అవమానించడం విచారకరం అంటూ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మకు భూమి ఉందని సాకు చూపి పెన్షన్ తొలగించారని లోకేశ్ ఆరోపించారు.

అసలు తనకు భూమే లేదని ఆ దివ్యాంగురాలు మొరపెట్టుకున్నా అధికారులు కరుణించలేదని మండిపడ్డారు. పైగా, పెన్షన్ రావాలంటే జగనన్నకు మొక్కుకో అంటూ కించపరిచేలా మాట్లాడడం ఘోరం అని పేర్కొన్నారు. తక్షణమే పుల్లమ్మ పింఛను పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. పండుటాకుల ఆసరా తీసేసి ఏంటీ అరాచకం? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.