Mylavaram: మైలవరంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్‌లోని ఓ తెర సీజ్

Mylavaram sanghanmitra theatre seized for showing Akhanda movie
  • అభిమానుల కోరిక మేరకు బెనిఫిట్ షో ప్రదర్శన
  • నిబంధనలకు విరుద్ధమంటూ స్క్రీన్‌ను సీజ్ చేసిన అధికారులు
  • టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వాపస్ చేస్తామన్న సంఘమిత్ర థియేటర్
కృష్ణా జిల్లా మైలవరంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ స్క్రీన్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బెనిఫిట్ షోను ప్రదర్శించారన్న ఫిర్యాదుపై ఈ చర్యలు తీసుకున్నారు. స్థానిక సంఘమిత్ర థియేటర్‌‌లో అభిమానుల కోరిక మేరకు నిన్న ఉదయం 8.30 గంటలకు బెనిఫిట్ షో వేశారు. ఆ తర్వాత ఉదయం ఆటను ప్రారంభించారు. అదే సమయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరి పోలీసులతో కలిసి థియేటర్ వద్దకు చేరుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షో వేసినందుకు ఫిర్యాదులు వచ్చాయని నిర్వాహకులకు తెలియజేశారు. ఆపై సినిమాను ప్రదర్శిస్తున్న స్క్రీన్‌ను సీజ్ చేశారు. ఉదయం ఆట పూర్తయిన తర్వాత రెండో తెరలో మాత్రమే ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే స్క్రీన్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. మరోవైపు, అభిమానుల కోరికను కాదనలేకే బెనిఫిట్ షో వేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా, అధికారులు స్క్రీన్‌ను సీజ్ చేయడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారి ఖాతాల్లోకి తిరిగి డబ్బులు బదిలీ చేస్తామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.
Mylavaram
Krishna District
Andhra Pradesh
Akhanda
Sanghamitra Theatre

More Telugu News