IMD: ఉత్తరాంధ్ర దిశగా తుపాను... ఐఎండీ తాజా నివేదిక

IMD latest bulletin on cyclone
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రాగల 12 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం
  • తుపానుగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • డిసెంబరు 4న తీరం దాటుతుందని ఐఎండీ వెల్లడి
అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని పయనం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతోందని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత మరింత బలపడి తదుపరి 24 గంటల్లో తుపానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఇది డిసెంబరు 4న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వివరించింది. భూభాగంపై చేరిన తర్వాత కూడా ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది.

కాగా, దీని ప్రభావం ఏపీ ఉత్తర కోస్తాపై డిసెంబరు 3 నుంచి ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని, డిసెంబరు 4న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని గంగా పరీవాహక ప్రాంతంపైనా తుపాను ప్రభావం ఉంటుందని పేర్కొంది.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని స్పష్టం చేసింది.
IMD
Cyclone
North Coastal Andhra
South Odisha
Bay Of Bengal

More Telugu News