తుపాను హెచ్చరికలు.. మూడు జిల్లాలకు పర్యవేక్షణ అధికారులను నియమించిన సీఎం జగన్

02-12-2021 Thu 12:30
  • అధికారులతో పరిస్థితులపై సమీక్ష
  • లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశం
  • సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం
CM Jagan Appoints Monitoring Officers For Storm Risk Districts
ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్.. అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమై పరిస్థితిపై సమీక్ష చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, ముంపు ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు.

తుపాను పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్. అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలారావును పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా వారిని సీఎం జగన్ ఆదేశించారు.