యూపీఏనా... ఇంకెక్కడుంది?: మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

01-12-2021 Wed 19:42
  • నేడు ముంబయిలో శరద్ పవార్ తో భేటీ
  • థర్డ్ ఫ్రంట్ పై చర్చలు
  • బీజేపీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న దీదీ
  • ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపు
Mamata Banarjee says there is no UPA
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ గతంలో రెండు పర్యాయాలు దేశాన్ని పాలించడం తెలిసిందే. నాటి యూపీఏలో అనేక పార్టీలు భాగస్వాములుగా కొనసాగాయి. అయితే, నాటి పొత్తు ఇప్పుడు కూడా కొనసాగించడం కష్టమేనని పలు పార్టీల వైఖరి చెబుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, "యూపీఏ ఏంటి... ఇంకా యూపీఏ ఉందా?" అంటూ ప్రశ్నించారు. "యూపీఏ ఎప్పుడో అంతరించిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడేమీ లేదు" అంటూ కొత్త ఫ్రంట్ వస్తోందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయేకి దీటుగా కొత్త కూటమి ఏర్పాటుకు గత కొంతకాలంగా శరద్ పవార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు మమతా బెనర్జీ కూడా తోడయ్యారు.

ఇవాళ్టి సమావేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా థర్డ్ ఫ్రంట్ పై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. బలంగా పోరాడే ప్రత్యామ్నాయ శక్తిని రూపొందించడమే తమ ప్రధాన అజెండా అని మమత నేడు ముంబయిలో పేర్కొన్నారు. ఎవరైనా పోరాడేందుకు ఆసక్తి చూపకపోతే తామేమీ చేయలేమని, అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందేనని మమత అభిప్రాయపడ్డారు.