బాలయ్యతో బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడేనా?

01-12-2021 Wed 19:11
  • బాలకృష్ణ నుంచి 'అఖండ'
  • బోయపాటితో మూడో సినిమా
  • రేపు భారీస్థాయిలో రిలీజ్
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి  
Akhanda movie update
మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువలన ఆయన దగ్గరికి వచ్చే దర్శకులంతా అందుకు తగిన నేపథ్యంలో కథలను రెడీ చేసుకునే వస్తుంటారు. యాక్షన్ కీ .. ఎమోషన్ కి మాస్ టచ్ ఇస్తూ నడిచిన కథలే ఆయనకి ఎక్కువగా విజయాలను అందిస్తూ వచ్చాయి. అలా బాలకృష్ణకి బి.గోపాల్ తరువాత భారీ హిట్లను ఇచ్చిన దర్శకుడిగా బోయపాటి కనిపిస్తాడు.

యాక్షన్ ను .. ఎమోషన్ ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడంలో బి. గోపాల్ ను అనుసరించినట్టుగా అనిపించినప్పటికీ, బోయపాటి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. హీరోయిజమ్ ను ఆయన బిల్డప్ చేసే తీరు గొప్పగా ఉంటుంది. ఇక డైలాగ్స్ విషయంలోను .. పాటల విషయంలోను తన పంథా వేరు. అలాంటి బోయపాటి .. బాలయ్యతో చేసిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి.

ఈ రెండు సినిమాల తరువాత బాలకృష్ణ వేరే దర్శకులతో చేసిన సినిమాలు ఆయనకి ఆ స్థాయి హిట్స్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక బోయపాటి చేసిన 'జయ జానకి నాయక' .. 'వినయ విధేయ రామ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ - బోయపాటి 'అఖండ' సినిమాతో రేపు థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.