సరిహద్దుల్లో చనిపోయిన రైతుల వివరాల్లేవ్.. పరిహారం ఇచ్చేది లేదు: పార్లమెంట్ లో కేంద్రం

01-12-2021 Wed 12:34
  • ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
  • 22 రకాల పంటలకు ఇప్పటికే మద్దతు ధర ఇచ్చామని వెల్లడి
  • సీఏసీపీ సిఫార్సుల మేరకు ధర నిర్ణయమని కామెంట్
  • ఏడాదిన్నరగా సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు
Center Says No Question Of Financial Assistance Farmers Dead At Borders
ఢిల్లీ సరిహద్దుల్లో మరణించిన (ఆత్మహత్యలు, ఇతర కారణాలు) రైతులకు పరిహారం ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏడాదిన్నరగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా.. కనీస మద్దతు ధర చట్టం, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం, రైతులపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో ఇంకా సరిహద్దుల్లోనే నిరసనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్ లో చర్చ సందర్భంగా సరిహద్దుల్లో మరణించిన రైతులకు పరిహారం ఇస్తారా? అన్న ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం దగ్గర వివిధ కారణాలతో చనిపోయిన రైతుల వివరాలు లేవని స్పష్టం చేశారు. కాబట్టి వారికి పరిహారం ఇచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు.

నిరసనలను ఆపాలని రైతు సంఘాలను ఎప్పటి నుంచో కోరుతున్నామని, వ్యవసాయ చట్టాలపై 11 రౌండ్ల చర్చలు కూడా జరిపామని ఆయన గుర్తు చేశారు. పంటకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా? అని ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించగా.. 22 రకాల పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని మంత్రి సమాధానమిచ్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకే ధరలను పెంచామని తెలిపారు. రైతులకు మద్దతు ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం–ఆశ) కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.

 పీఎం ఆశ కింద ఏదైనా పంట కాలానికి సంబంధించి పంట కొనుగోళ్లప్పుడు నూనె, పప్పు ధాన్యాల రైతులకు మద్దతు ధర అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం అందించే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) లేదా ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (పీడీపీఎస్) పథకాల్లో ఏదో ఒకదానిని వినియోగించుకోవచ్చునని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఇవి కాకుండా ప్రైవేట్ ప్రొక్యూర్ మెంట్ అండ్ స్టాకీస్ట్ స్కీమ్ (పీపీఎస్ఎస్)ను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్నారు.

కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిలో 750 మందికిపైగా రైతులు చనిపోయారని రైతు సంఘాల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో చలి, ఇతర వాతావరణ పరిస్థితులు, అపరిశుభ్ర పరిస్థితులతో చాలా మంది రైతులు చనిపోయారు. మరికొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.