తీరం వైపుగా అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

01-12-2021 Wed 07:17
  • నెల్లూరుకు 1400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతం
  • రేపు వాయుగుండంగా మారి, ఎల్లుండి తుపానుగా బలపడే అవకాశం
  • ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
  • ఉత్తరాంధ్రపైనా పెను ప్రభావం
  • తుపానుగా బలపడితే ‘జవాద్’ అని నామకరణం
IMD predicts heavy rainfall in these states
భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ థాయిలాండ్‌ వద్ద అండమాన్ సమీపంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా ఏపీ, ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తోంది. నిన్న సాయంత్రానికి నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపటికి ఇది వాయుగుండంగా మారుతుందని, ఎల్లుండి (3న) తుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఆ తర్వాత అది వాయవ్యంగా కదిలి నాలుగో తేదీ ఉదయం ఒడిశా తీరానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. వాయుగుండం తుపానుగా కనుక బలపడితే దానికి ‘జవాద్’ అని పేరుపెట్టనున్నారు.
 
5, 6 తేదీల్లో  ఇది తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాలుగో తేదీన ఒడిశాలో, 5వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో, 5, 6 తేదీల్లో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావం ఏపీపైనా తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోను ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.