ఇది భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి.. ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర చలోక్తులు

30-11-2021 Tue 15:12
  • గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఇండియన్లే సీఈవోలు
  • ఇది ఇండియన్ సీఈవో వైరస్ అంటూ జోక్
  • ఓ కంపెనీ సీఈవో పెట్టిన పోస్టుకు బదులు
This Is Indian Pandemic which Has No Vaccine Anand Mahindra On Twitter New CEO
ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు ఎంపికవడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. అది టీకాలేని ఇండియన్ వైరస్ అంటూ చలోక్తి విసిరారు. ‘‘ఇది భారత్ లో పుట్టిన మహమ్మారి. ఆ విషయం చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నా. ఆ వైరస్ పేరు ‘ఇండియన్ సీఈవో వైరస్’. దానికి టీకా కూడా లేదు’’ అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే స్ట్రైప్ అనే కంపెనీ సీఈవో పెట్టిన పోస్టుకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ‘‘గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం, పాలో ఆల్టో నెట్ వర్క్స్.. ఇప్పుడు ట్విట్టర్ సీఈవోలంతా భారతీయులే. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల ఇంతటి విజయాన్ని చూడడం అద్భుతంగా ఉంది. అంతేగాకుండా వలసవచ్చేవారికి అమెరికా ఎన్ని అవకాశాలిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది’’ అంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దానికి బదులుగానే ఇది ఇండియన్ సీఈవో వైరస్ అంటూ ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు.