Pakistan: చర్యలు తప్పవు.. గురుద్వారాలో మోడల్ ఫొటోషూట్‌పై పాక్ తీవ్ర హెచ్చరిక

  • గురుద్వారా నిబంధనలు పాటించకుండా ఫొటో షూట్
  • తీవ్ర వివాదాస్పదమైన ఫొటో షూట్
  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి
  • క్షమాపణలు చెప్పిన మన్నత్ క్లాతింగ్
Pakistan promises legal action after outrage erupts over models bareheaded pics at gurdwara

పాకిస్థాన్‌ కర్తాపూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాలో ఓ మోడల్ ఫొటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. గురుద్వారాలో మహిళలు నుదిటి భాగం కనిపించకుండా వస్త్రాన్ని కప్పుకోవడం తప్పనిసరి. అయితే, పాకిస్థానీ ఫ్యాషన్ బ్రాండ్ మన్నత్ క్లాతింగ్ కోసం మోడల్ సులేహా ఇంతియాజ్ గురుద్వారా నిబంధనలు పాటించకుండా, నుదుటిపై వస్త్రం కప్పుకోకుండా గురుద్వారాలో చేసిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. మన్నత్ సంస్థ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఆపై వివాదాదస్పదమయ్యాయి.

మరోవైపు, భారత జర్నలిస్ట్ రవీందర్ సింగ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేశారు. మోడల్ సులేహా తీరు సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పంజాబ్ పోలీసులు కూడా ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ ప్రారంభించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంబంధిత దుస్తుల బ్రాండ్, మోడల్‌పై దర్యాప్తు చేపడతామని, అన్ని మతాల ప్రార్థనా స్థలాలను సమానంగా గౌరవించాలని అన్నారు. కాగా, ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో లాహోర్‌కు చెందిన మన్నత్ క్లాతింగ్ క్షమాపణలు తెలిపింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది.

More Telugu News