Chisako Kakehi: వృద్ధాప్యంలో వరుస హత్యలు చేసిన జపనీస్ మహిళ

  • భర్త చనిపోయిన తర్వాత నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వృద్ధురాలు
  • నలుగురిపైనా సైనేడ్ ప్రయోగం
  • ముగ్గురి మృతి... ఒకరు ఏడాది తర్వాత కన్నుమూత
  • 2017లో మరణశిక్ష
Japanese old age woman turns romantic killer

చిసాకో కకేహీ... జపాన్ కు చెందిన ఈ వృద్ధురాలి వయసు 74 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో వృద్ధులు ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ కకేహీ కథ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మొత్తం నలుగురి ప్రాణాలు తీసింది. మొదటి మర్డర్ 61వ పడిలో ఉన్నప్పుడు చేసిందట. 2014లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

కకేహీ జపాన్ లోని సాగా రాష్ట్రానికి చెందిన మహిళ. 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ఆమె ఓ ప్రింటింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేది. 1994లో ఆమె భర్త చనిపోయాడు. 2007లో తోషియాకి సుహీరో అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే 2007 డిసెంబరు 18న సుహీరో మధ్యాహ్న భోజనం చేసి మాత్రలు వేసుకున్న కాసేపటికే కుప్పకూలిపోయాడు. కకేహీ అతడి మాత్రల్లో ఓ సైనేడ్ గుళికను కూడా కలిపింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా, చావబోయి బతికాడు. కానీ అప్పటికే అతడి శరీర అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చూపు మందగించింది. ఏడాది తర్వాత సుహీరో ప్రాణాలు విడిచాడు.

ఆ తర్వాత కకేహీ 2012లో మసనోరి హోండాను పెళ్లాడింది. అతడి కథ కూడా సైనేడ్ తో ముగించింది. 2013లో ఇసావో, మినోరు హియోకి సైతం కకేహీ చేతిలో బలయ్యారు. ముగ్గురు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోగా, సుహీరో అనే వ్యక్తి మాత్రం బతికినా, ఏడాది తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.

భర్త చనిపోయాక కకేహీ డేటింగ్ వెబ్ సైట్లను ఫాలో అయ్యేది. అందులో బాగా డబ్బున్న వాళ్లను గుర్తించి వాళ్లకు వలపు వల వేసేది. ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లను తన మాటలతో మత్తులో ముంచెత్తేది. దాంతో 70వ ప్రాయంలో ఉన్నవాళ్లు కూడా తనతో పెళ్లికి ఉవ్విళ్లూరేవారు. ఆ విధంగా సంపన్నులను పెళ్లాడి వారి ఆస్తి తన పేరిట బదలాయించుకున్న తర్వాత వారిని పరలోకానికి పంపేది.

అయితే, పలువురి మృతి అనుమానాలు రేకెత్తించడంతో శవపరీక్షల్లో సైనేడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దాంతో ఆమెపై మూడు హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు నమోదయ్యాయి. 2014లో ఆమె అరెస్ట్ కాగా, మూడేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 2017లో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె ఈ తీర్పును ఇటీవలే పై కోర్టులో అప్పీల్ చేసుకున్నా ఫలితం దక్కలేదు.

More Telugu News