మహిళా ఎంపీలతో శశి థరూర్ ఫొటో... చిక్కులు తెచ్చిపెట్టిన వ్యాఖ్యలు!

29-11-2021 Mon 21:26
  • నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • మహిళా ఎంపీలతో థరూర్ సెల్ఫీ
  • ఫొటోను ట్వీట్ చేసిన వైనం
  • మహిళా ఎంపీలతో లోక్ సభ ఆకర్షణీయమంటూ వ్యాఖ్యలు
Shashi Tharoor selfie with women MPs
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభ ప్రాంగణంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్... కొందరు మహిళా ఎంపీలతో కలిసి సెల్ఫీ దిగారు. నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి, ప్రణీత్ కౌర్, జ్యోతిమణి, సుప్రియా సూలే, తమిళచ్చి తంగపాండియన్ లతో కలిసి దిగిన ఆ ఫొటోను శశి థరూర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతవరకు బాగానే ఉంది!

కానీ ఆ ఫొటోకు ఆయన జోడించిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... మహిళా ఎంపీలు ఉన్నప్పుడు లోక్ సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల అమర్యాదకరంగా ఉన్నాయని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో థరూర్ వెంటనే స్పందించారు.

ఎవరినీ బాధించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, తనను క్షమించాలని కోరారు. ఎంతో సరదగా ఆ ఫొటో తీసుకున్నామని, ఆ ఫొటోను ట్వీట్ చేయాలని మహిళా ఎంపీలే కోరారని వివరణ ఇచ్చారు.

అటు ఎంపీ వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. పార్లమెంటులోనూ, రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న మహిళలు మీకు ఆకర్షణీయ వస్తువుల్లా కనిపిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. పార్లమెంటులో ఈ విధంగా మహిళలను అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం మానండి అంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ హితవు పలికారు.

ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నందీ కూడా వెలిబుచ్చారు. మహిళా ఎంపీల రూపంపై వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విభిన్నంగా స్పందించారు. పార్లమెంటులో మహిళా ఎంపీలందరికీ ఇదొక అభినందనగా ఎందుకు భావించకూడదని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడరాదని జ్వాల హితవు పలికారు.