Ravichandran Ashwin: గెలుపు బాటలో టీమిండియా... అశ్విన్ మరో ఘనత

  • కాన్పూర్ టెస్టులో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్
  • టీ బ్రేక్ సమయానికి కివీస్ స్కోరు 4 వికెట్లకు 124 రన్స్
  • అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మూడోస్థానంలో అశ్విన్
Ashwin becomes third highest wicket taking bowler for India

కాన్పూర్ టెస్టులో టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ లంచ్ విరామం తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయింది. టీ విరామం సమయానికి ఈ జట్టు స్కోరు 63.1 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు. ఆ జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలంటే మరో 159 పరుగులు చేయాలి.. అయితే మరో 31.5 ఓవర్లు మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడంలేదు. మరో ఆరు వికెట్లు పడగొడితే విజయం టీమిండియా సొంతం అవుతుంది.

ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఓపెనర్లు విల్ యంగ్ (2), టామ్ లాథమ్ (52) ను బౌల్డ్ చేసిన అశ్విన్ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ 80 టెస్టుల్లో 418 వికెట్లు పడగొట్టాడు.

ఈ జాబితాలో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు సాధించాడు. పేస్ దిగ్గజం కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.

More Telugu News