మళ్లీ ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కాసేపట్లో జగన్ వీడియో కాన్ఫరెన్స్

29-11-2021 Mon 10:45
  • ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమైన పలు జిల్లాలు
  • తాజాగా మరోసారి విరుచుకుపడుతున్న భారీ వర్షాలు
  • ఇప్పటికే కేంద్రాన్ని వెయ్యి కోట్ల ఆర్థిక సాయాన్ని కోరిన జగన్
Jagan to conduct video conference with district collectors on heavy rains
ఏపీని వరుస తుపానులు, భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన కుంభవృష్టి వర్షాలతో పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. అన్ని సురక్షిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు కాసేపట్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్షరెన్స్ నిర్వహించనున్నారు. కలెక్టర్లకు తగు సూచనలు చేయనున్నారు. మరోవైపు తుపాన్ వల్ల వాటిల్లిన నష్టంపై కేంద్రం బృందం ఓ అంచనాకు వచ్చింది. నాలుగు జిల్లాల్లో గత మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించింది. సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ కానుంది. ఇంకోవైపు తక్షణ సాయంగా వెయ్యి కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్రాన్ని జగన్ ఇప్పటికే కోరారు.