పరవాడ ఫార్మా సిటీలో మరోమారు గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి

29-11-2021 Mon 09:39
  • వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో ఘటన
  • పాయకరావుపేటకు చెందిన యువకుల మృతి
  • విశాఖలో సర్వసాధారణంగా మారిన గ్యాస్ లీక్ ఘటనలు
Gas leak In paravada Two dead
విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ ఘటన మరోమారు కలకలం రేపింది. వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు ఇటీవల సర్వ సాధారణం అయిపోయాయి.

గతేడాది మేలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోగా, చుట్టుపక్కల ఉన్న వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందలాదిమంది కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. తాజా ఘటన విశాఖ వాసులను మరోమారు ఆందోళనకు గురిచేసింది.