మూడు రాజధానులపై కమలానంద భారతి కీలక వ్యాఖ్యలు

29-11-2021 Mon 08:59
  • తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలానంద భారతి
  • మూడు రాజధానుల భావన క్రమంగా మూడు రాష్టాల ఆలోచనకు దారితీస్తుంది
  • రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుకుంటున్నా
Kamalananda Bharati Responds About AP Three Capitals
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులపై భువనేశ్వర పీఠాధిపతి (గన్నవరం) కమలానంద భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లును ఇటీవల ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించింది. దీనిపై కమలానంద భారతి మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లును మళ్లీ తెస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఇది క్రమంగా ప్రజల్లో మూడు రాష్ట్రాలు కావాలనే భావనను కలిగిస్తుందని అన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా ఒక ప్రాంతాన్ని మాత్రమే ఉంచాలని, అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేశారని, కాబట్టి రాజధానిని అక్కడే ఉంచాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అధికారంలో ఉన్నవారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కమలానంద భారతి అన్నారు.