అమెరికాలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట విద్యార్థి మృతి, కోమాలోకి నల్గొండ యువతి

29-11-2021 Mon 07:53
  • 11 నెలల క్రితం అమెరికాకు
  • శనివారం షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన టిప్పర్
Suryapet student killed in road accident in america
ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేటలోని నల్లాల బావి ప్రాంతానికి చెందిన చిరుసాయి (22) ఉన్నత విద్య అభ్యసించేందుకు 11 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. శనివారం షాపింగ్‌కు వెళ్లిన సాయి సాయంత్రం కారులో ఇంటికి బయలుదేరాడు.

ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన ఓ టిప్పర్ అతడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, నల్గొండకు చెందిన యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.